
డబ్బుల్లేక… టీవీ9 జర్నలిస్టు కుటుంబ కన్నీటిగాథ
జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు. భరోసా.. భద్రతలేని ఉద్యోగాలు. భార్యల మీద ఈసమెత్తు బంగారం ఉండదు. అద్దె ఇల్లు.. చనిపోతే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి. సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కుటుంబ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఒక బాబు. వీరి భవిష్యత్ ఏంటో ఆలోచిస్తేనే బాధనిపిస్తుంది. సొంత ఇల్లులేదు. సొంత ఊళ్లో జాగలేదు. సిరిసిల్లలో అద్దె ఇంట్లో జీవనం సాగించిన ఆయన శవం బంధువుల ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వాహించాల్సిన పరిస్థితి. కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదిస్తూ ‘కొడుకా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు. పూల దండలు సంపాదించుకుంటున్నవారా? కొడుకా.. నీ పిల్లల బతుకు ఏం కావాలిరా.. మాకు అగ్గి పెడుతావనుకుంటే.. మేం నీకు అగ్గిపెట్టాల్సి వస్తుంది కొడుకా..’ అంటూ ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. జర్నలిస్టు మిత్రులు వృత్తిపరంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. నెలవారీ జీతంలేని జర్నలిస్టులు ఆలోచించాలి. ఇతర ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లోకి మారిపోవాలి . భార్యాపిల్లల్ని కాపాడుకోవాలి.
