TEJA NEWS

రాచాల ఎఫెక్ట్… జూరాల ఆయకట్టురైతులకు నీరు విడుదల
వనపర్తి
జూరాల నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల చేయకుంటే ఈ నెల 17న (గురువారం) రైతులతో కలిసి దీక్ష చేస్తానని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుటాహుటిన నీటిని విడుదల చేశారు.

వివరాల్లోకి వెళితే జూరాల ఎడమ కాలువ నుంచి సాగునీరు విడుదల కాకపోవడంతో.. దాదాపుగా 65 వేల ఎకరాలలో సాగు చేసినా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి ఏర్పడింది.

మంగళవారం జూరాల వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినా అధికారులు స్పందించకపోవడంతో బీసీ పొలిటికల్ జెఎసి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్ రాచాల యుగంధర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన బుధవారం జూరాలకు చేరుకొని రైతులతో మాట్లాడి ఆత్మకూరు రోడ్డు భవనాల అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు.

వర్షాలు పుష్కలంగా కురిశాయి, వరదలు పెద్ద ఎత్తున వచ్చాయి.. నీటిని చెరువులు, కుంటలలో నిలువ చేసుకోవడంలో ఎక్కడ పొరపాట్లు జరిగాయి..? రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటూ యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి,
ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడితే జూరాలకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించారని మీడియాకు చెప్పారు. కానీ ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వం కేవలం ఒక టీఎంసీ నీటిని విడుదల చేయగా.. జూరాలకు చేరింది అర టీఎంసీ మాత్రమే అని యుగంధర్ గౌడ్ తెలిపారు.

పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందక రైతులు ఆందోళన చేస్తుంటే., ప్రజా ప్రతినిధులు సంబరాలు జరుపుకుంటూ, పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

బుదవారం సాయంత్రం వరకు జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయకుంటే ఈనెల 17న జూరాల వద్ద రైతులతో కలిసి దీక్ష చేపడతానని, నీటిని వదిలేవరకు అక్కడే కూర్చుంటానని ఆయన హెచ్చరించారు.

రాచాల యుగంధర్ గౌడ్ ప్రకటనతో స్పందించిన ఎమ్మెల్యే మరియు అధికారులు హుటాహుటిన జూరాల చేరుకుని నీటిని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, మ్యాదరి రాజు, రైతులు విజయ్ శ్రీను, తిరుపతయ్య, వెంకటయ్య, గుంటిపల్లి రాములు, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.