
సేంద్రీయ వ్యవసాయం చేస్తూ రైతులు భావితరాలకు భూమిని కాపాడాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
రైతు వేదికల్లో రైతు నేస్తం ద్వారా శాస్త్రవేత్తలు సలహాలు సూచనలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచన
వనపర్తి జిల్లా
రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ భావి తరాలకు భూమిని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జిల్లాలో ప్రతి రైతు వేదికల్లో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి
నాగవరం రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ భూసారం తగ్గిపోయిందని, ప్రతి సంవత్సరం డి. ఏ.పి., యూరియా వంటి రసాయనిక ఎరువులు వాడుతూ పోతే అనతి కాలంలోనే భూమి నిస్సత్తువగా మారిపోయి భావితరాలకు పంటలు రాకుండా చవట నేలగా మారిపోతుందన్నారు.
భావితరాలకు సైతం భూమి ఉపయోగపడి పంటలు పండాలంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలని రైతులను కోరారు.
పంట వేసే 45 రోజుల ముందు జీలుగా పచ్చ రొట్ట పెసర జనుము వంటి పంటలు సాగు చేసి వాటిని భూమిలో దుక్కడం వల్ల మంచి సేంద్రియ ఎరువుగా మారుతుందని తెలిపారు. దీనితో పాటు పశువుల ఎరువు వాడటం వల్ల అధిక దిగుబడి రావటమే కాకుండా భూమి సారవంతంగా మారుతుందన్నారు.
జిల్లాలో జీలుగ విత్తనాలు 1010 క్వింటాలు సరఫరా అయ్యాయని, మరో రెండు వేల క్వింటాళ్ల విత్తనాలు పంపించాల్సిందిగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.
ప్రతి మంగళవారం రైతు వేదికల్లో రైతు నేస్తం అనే కార్యక్రమం ద్వారా ఆన్లైన్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు రైతులకు వ్యవసాయ సాగు, తెగుళ్ళ నివారణ పై సలహాలు, సూచనలు ఇస్తున్నారని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
భారత దేశంలో ఆయిల్ పామ్ కు చాలా డిమాండు ఉందని, రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు ఆలోచించాలని సూచించారు. పంట చేతికి వచ్చే వరకు రైతులకు అంతరపంట సహాయం కింద ఎకరాకు 4 వేల రూపాయలు సహాయం చేస్తుందన్నారు.
ఆన్లైన్ ద్వారా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుచరిత మాట్లాడుతూ ఆకుపచ్చ వ్యవసాయం చేయడం వల్ల భూమి సారవంతంగా మారటంతో పాటు అధిక దిగుబడి, పంట తెగుళ్లు తగ్గుతాయని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ మాట్లాడుతూ జీలుగా పచ్చ రొట్ట విత్తనాలు పిఎసిఎస్ కేంద్రాలలో ఇస్తారని వాటిని పొలాల్లో పండించి పూత దశలో రోటోవేటర్ ద్వారా దున్నటం వల్ల మట్టిలో కలిసిపోయి నేల సారవంతంగా మారుతుందన్నారు. ప్రస్తుతము జిల్లాకు ఒక వెయ్యి పది క్వింటాలు విత్తనాలు వచ్చాయని త్వరలోనే మరిన్ని క్వింటాళ్లు వస్తాయని ప్రతి రైతు పచ్చరొట్ట, పెసర, జీలుగా పంటలు తప్పనిసరిగా సాగు చేయాలని తెలిపారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
