
గిట్టుబాటు ధర లేక ధాన్యానికి నిప్పు
సూర్యపేట జిల్లా : ఎండనక,వాననక చెమటను నెత్తురుచేసుకొని ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని ఓ రైతు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన ఘటన అందరి హృదయాలను కలిచివేస్తుంది. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు ఐదు ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కువ ధర 1600 రూపాయలు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని ఆవేదన చెందాడు. దీంతో తాను తీసుకొచ్చి కుప్ప పోసిన ధాన్యం రాశికి నిప్పంటిచ్చి తగలబెట్టాడు.
రైతు మాటల్లో….
ఆరు నెలలుగా ఎంతో కష్టపడి ఐదు ఎకరాలు కౌలుకు చేశాను. ధర ఎక్కువ వస్తుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కి ధాన్యం తీసుకొస్తే ఖరీదు దారులు, కమిషన్ దారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్ద పడుకున్నానని బోరున విలపించాడు. కనీసం మద్దతు ధర కూడా రానీ ఈ ధాన్యం నాకు వద్దని ధాన్యం తగల పెడదామని నిప్పింటించానని పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న మార్కెట్ సిబ్బంది హుటా హుట్టిన వచ్చి నిప్పుని ఆర్పేసి రైతుతో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తామని నిప్పంటుకున్న ధాన్యాన్ని ఆర్పారు.
