
కపిలేశ్వరాలయంలో వైభవంగా పుష్పయాగం
తిరుపతి: తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ కపిలేశ్వరాలయంలో సోమవారం పత్ర పుష్పయాగం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగం నిర్వహించారు.
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి 2 టన్నుల పత్రాలు, 2 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు.
ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జీ.దేవేంద్రబాబు, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. శ్రీనివాసులు, ఏఈవో కె. సుబ్బరాజు, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం.రవికుమార్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
