TEJA NEWS

దుష్టశిక్షణ-శిష్ట రక్షణే నరసింహావతారం యొక్క ప్రధానోద్దేశం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • కొమరవవల్లిపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై పెద్దరథం తిరునాళ్ల ప్రారంభించిన ప్రత్తిపాటి.
  • స్వామివారి కల్యాణంలో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్న మాజీమంత్రి.

దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసమే సాక్షాత్తూ ఆ శ్రీ మహా విష్ణువు నరసింహస్వామి రూపంలో రాక్షస సంహారం గావించి ముల్లోకాలను రక్షించాడని, నరసింహావతారం ఎంతో విశేషమైన స్వరూపమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని కొమరవల్లిపాడులో వేంచేసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహోత్సవాలు, కల్యాణోత్సవానికి ప్రత్తిపాటి హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగమైన రథం తిరునాళ్లను స్వయంగా ప్రారంభించిన ప్రత్తిపాటి. భక్తులతో కలిసి స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నృసింహస్వామి జయంతి నాడు జరిగే స్వామి వారి కల్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలు చూడటానికి భక్తులు వేలసంఖ్యలో తరలి రావడం గొప్ప విషయమన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవ నిర్వాహకులు, పోలీస్ , మున్సిపల్, ఇతర శాఖలవారికి ప్రత్తిపాటి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. నరసింహావతారం విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, సగం మృగం, సగం మానవరూపంలో రాక్షస సంహార నిమిత్తమే శ్రీ మహా విష్ణువు సరికొత్త అవతారం దాల్చాడన్నారు. పెద్ద రథం తిరునాళ్లగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడం ఆస్వామిపై వారికున్న భక్తివిశ్వాసాలకు నిదర్శనమన్నారు. తిరునాళ్లలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, గట్టినేని సాయి, కొత్త కోటేశ్వరరావు, తదితరులున్నారు.