
తెలుగుదేశం పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి: మాజీమంత్రి ప్రత్తిపాటి
ప్రజలకోసమే ప్రభుత్వమనేలా టీడీపీ పరిపాలన : ప్రత్తిపాటి.
తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలపాలన్నదే చంద్రబాబు లక్ష్యం : ప్రత్తిపాటి
చిలకలూరిపేట రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని శాసనసభ్యులు, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకొని, పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ప్రత్తిపాటి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తిచేసుకొని, 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం పార్టీ కుటుంబసభ్యులుగా అందరికీ గర్వకారణమన్నారు.
ప్రజలకోసమే ప్రభుత్వమనేలా టీడీపీ పరిపాలన ..
పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే సదాశయంతో టీడీపీ ఏర్పడిందని, ప్రజలవద్దకు పాలన ద్వారా ప్రజల కోసమే ప్రభుత్వమనేలా టీడీపీ పరిపాలన చేసిందన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిహక్కు, రూ.2కే కిలోబియ్యం, బలహీనవర్గాలకు రాజ్యాధికారం వంటి వినూత్న పథకాలతో తెలుగుదేశం ప్రజలమనసులు గెలిచిందని ప్రత్తిపాటి తెలిపారు. ఒకప్పుడు ప్రాంతీయపార్టీగా ఏర్పడిన టీడీపీ, జాతీయరాజకీయాలను శాసించేస్థాయికి ఎదిగిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలోని ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించడం స్వాగతించాల్సిన విషయమన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు బాటలోనే భవిష్యత్ లో లోకేశ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారనే నమ్మకం, ధైర్యం కార్యకర్తలకు ఉందన్నారు.
భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు ఆలోచిస్తారు…
రాష్ట్రాన్ని దేశంలో, తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్-1 స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు దూరదృష్టితో ఆలోచనలు చేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. గతంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించినా, ఇప్పుడు ఏఐ సాంకేతికతను స్వాగతిస్తున్నా .. రాష్ట్రాభివృద్ధి ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నదేనని పుల్లారావు చెప్పారు. అమరావతి పోలవరం నిర్మాణం దిశగా భవిష్యత్ తరాలు సంతోషంగా జీవించేలా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఎన్ని సంక్షోభాలు, సవాళ్లు ఎదురైనా తెలుగుదేశం వాటిని తట్టుకొని నిలిచిందని, గత ఎన్నికల్లో 93శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిందని పుల్లారావు చెప్పారు. గత ప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలను ఎదిరించి పోరాడిన నాయకులు, కార్యకర్తలు, లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగుదేశానికి అఖండ విజయం చేకూర్చాయని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలోని ఎన్.ఆర్.టీ సెంటర్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన నాయకులు, కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసమే చంద్రబాబు సత్సంకల్పంతో ఉగాదినాడు పీ-4 కార్యక్రమం ప్రారంభిస్తున్నారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు అమలుచేసిన పథకాలు, సంస్కరణలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని పుల్లారావు చెప్పారు. అందరికీ విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఇళ్లు, రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆనాడు, ఈనాడు, ఏనాడూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదలపక్షానే ఉంటుందని ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ హోదాలలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు
