స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రైతు–కార్మికులకు పెను ముప్పు…

TEJA NEWS

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రైతు–కార్మికులకు పెను ముప్పు….

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి….

–సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, స్విట్జర్లాండ్ తదితర దేశాలతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రైతులు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సీఐటీయూ జిల్లా సదస్సు గోదావరిఖనిలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో సీఐటీయూ నాయకుడు సీహెచ్ భద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగి పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్త విత్తన చట్టాల ద్వారా బహుళజాతి విత్తన, వ్యవసాయ సంస్థల ఆధిపత్యం పెరిగి చిన్న, సన్నకారు రైతులపై ఉత్పత్తి వ్యయ భారం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో మూడవ డిస్కం ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసి రైతులపై అదనపు భారం మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విబీ గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కనీస వేతనాల షెడ్యూల్ జీవో-6ను సవరించి నెలకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీహెచ్ భద్రయ్య, గట్టు సతీష్, ఏ. మల్లారెడ్డి, ఎం. శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, ఎస్. రమేష్, సీహెచ్ చంద్రారెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top