ప్రతిభావంతులైన క్రీడాకారులకు శాఖ తరఫున పూర్తి ప్రోత్సాహం….

TEJA NEWS

ప్రతిభావంతులైన క్రీడాకారులకు శాఖ తరఫున పూర్తి ప్రోత్సాహం….

– రామగుండం పోలీస్ కమిషనర్…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏ పోటీల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ అంబర్ కిశోర్ ఝా విజేతలను అభినందించి, వారి విజయాలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జట్టు సమన్వయం, పరస్పర సహకారం, క్రమశిక్షణ, నిరంతర సాధన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. పోలీస్ విధుల్లో శారీరక దారుఢ్యంతో పాటు జట్టు భావన, మానసిక స్థైర్యం అత్యంత అవసరమని, వాటిని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరాల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు ప్రతి బాధ్యతలో జట్టు సమన్వయం విజయానికి దోహదపడుతుందని అన్నారు.

భవిష్యత్తులో కూడా పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడల్లో మరింత ప్రతిభ కనబర్చి శాఖకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలకు సమయం కేటాయించే వారికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో కాళేశ్వరం జోన్ నుంచి 51 మంది క్రీడాకారులు పాల్గొనగా, 31 మంది మొత్తం 48 పతకాలు సాధించారు. ఇందులో 8 బంగారు, 16 వెండి, 24 కాంస్య పతకాలు ఉన్నాయి.
పతక విజేతల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన నలుగురు, ములుగు జిల్లా నుంచి ముగ్గురు, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి తొమ్మిది మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, జోన్ సూపరింటెండెంట్ సందీప్, ఆర్‌ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేష్, కాసిరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top