
గరుడ వారధి” నిర్వహణ పట్టదా?
** మున్సిపల్ అధికారులకు బీజేపీ నేత నవీన్ సూటి ప్రశ్న
తిరుపతి: తిరుపతిలో విపరీతంగా పెరిగిన యాత్రికులు, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మింపజేసిన గరుడ వారధి ఫ్లై ఓవర్ నిర్వహణ మున్సిపల్ అధికారులకు, నిర్మాణ కాంట్రాక్టర్ కు పట్టదా? అని బీజేపీ సీనియర్ నేత, సామాజిక సేవాకర్త నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి వీవీ మహల్ రోడ్డులోని తన కార్యాలయంలో ఫ్లైఓవర్ నిర్వహణపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ… ఫ్లై ఓవర్ పరిశీలిస్తే నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా అనే అనుమానాలు నగర ప్రజలలో కలుగుతున్నాయన్నారు.
గరుడ వారధి నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్యలతో యాత్రికులకు, నగర ప్రజలకు శాపంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకొని యాత్రికుల, నగర ప్రజల సౌకర్యార్థం గరుడవారధికి పునాది రాయి వేశారని, హైదరాబాద్ “నెక్లెస్ రోడ్” తరహాలో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ఉండాల్సిన గరుడ వారధి కళావిహీనంగా మారడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. గరుడ వారధి నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తానని నవీన్ పేర్కొన్నారు. గరుడ వారధి 2019లో 694 కోట్లతో ప్రారంభమైందని, అందులో 600 కోట్లు ఫ్లైఓవర్ కు, 90 కోట్లు స్మార్ట్ స్ట్రీట్స్, మెయింటెనెన్స్, కాలువల నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకోసారి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత టిటిడి, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులపై ఉన్నా అలాంటి భద్రతా పరీక్షలు జరిగిన దాఖలాలు కనపడటం లేదన్నారు.
అలా రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిగితే వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు పడినప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగినప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణంలో ఏదైనా చిన్నచిన్న పొరపాట్లు ఉంటే గుర్తించి వెంటనే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే
గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న లీలామహల్ నుంచి లక్ష్మీపురం, శంకరంబాడి సర్కిల్, పద్మావతి పురం పైభాగం వరకు ఉన్న జంక్షన్ల, డివైడర్ల బ్యూటిఫికేషన్ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దే అయినా గాలికి వదిలేసారని మండిపడ్డారు. డివైడర్ల మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తుందన్నారు.
గరుడ వారధి 5 సంవత్సరాల నిర్వహణ కోసం సుమారు 25 కోట్లతో అదే కాంట్రాక్టర్ కు అప్పజెప్పడం అందులో కొంత నిధులు విడుదల చేయడం జరిగినా నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్య పెరగడం, నగర ప్రజలకు యాత్రికులకు శాపంగా మారిందన్నారు.
తిరుపతిలో వర్షం పడితే గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయని దానికి కారణం కాలువ నిర్మాణాలను చేపట్టకపోవడమే అన్నారు.
టిటిడి – నగరపాలక సంస్థ – స్మార్ట్ సిటీ – గరుడ వారధి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం సర్టిఫికెట్ తీసుకొని 5 సంవత్సరాలు సక్రమంగా పూర్తి నిర్వహణ చేపట్టేలా ఆదేశాలిచ్చి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా నగర ప్రజలలో అనుమానాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
