
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.
నేడు ఖాతాల్లో బకాయిల డబ్బులు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రబుత్వం. నిధులు సర్దుబాటు కావడంతో ఈ బకాయిల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు పాతిక వేల కోట్లకుపైగా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్లుగా ఇవి పేరుకుపోయాయి. గత వైసీపీ హయాంలో ఇవ్వలేదని ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోయారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి సమయంలో కొంత వరకు బకాయిలు చెల్లించింది. ఇంకా బకాయిలు ఉన్నందున వాటిని ఇప్పుడు చెల్లించేందుకు ముందుకొచ్చింది.
జీపీఎఫ్, రిటైర్‌మెంట్ ప్రయోజనాల రూపంలో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఇంకా ఉద్యోగులకు చెల్లించాలి. వాటిని ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో వేయాలని చూస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు పేరుకున్న బకాయిలు కూడా చెల్లించబోతున్నారు. మొత్తం రూ. 6,200 కోట్లు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు వచ్చాయి.
ఐదేళ్లుగా పేరుకున్న బకాయిలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం కూడా తాత్సారం చేస్తోందని ఈ మధ్యే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంఘాలు మీడియా సమావేశాలు పెట్టిప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది మరింత తీవ్రం కాక ముందే ఆ లెక్కలు సెట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే శుక్రవారం ఆయాఖాతాల్లో నగదు జమ చేయనుంది.
