
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ధాన్యం పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్న ఘనుడు డీఎస్ఓ ను కాపాడుతున్నది ఎవరు
జిల్లా ఉన్నతాధికారుల తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా— బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరిక
వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటూ… తీవ్ర అవినీతికి పాల్పడుతున్న జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు వనపర్తి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ డీఎస్ఓ అవినీతి అక్రమాలపై గత కొన్ని నెలలుగా ప్రధాన పత్రికల్లో చాలా కథనాలు వస్తున్నా కూడా ఉన్నతాధికారులు స్పందించడం లేదన్నారు.
కరెంటు లేని మిల్లులకు, యంత్రాలు లేని మిల్లులకు ధాన్యం కేటాయించినట్టు ఆధారాలు ఉన్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారుకు ఆయనను ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.
డిఎస్ఓ కాశి విశ్వనాధ్ చేస్తున్న అక్రమాలకు ఉన్నతాధికారులకు ఏమైనా భాగస్వామ్యం ఉందేమో అన్న అనుమానం జిల్లా ప్రజలకు కలుగుతుందన్నారు.
బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులకు,
పిడిఎస్ బియ్యం పట్టుబడి, కేసులు నమోదైన వారికి ధాన్యం కేటాయించట్లేదని నీతి వాక్యాలు చెబుతున్న ఉన్నతాధికారులు నిబంధనలకు పాతర పెట్టి అసోసియేషన్ పెద్దలకు మరియు బడా మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలన్నారు.
సాధారణ మిల్లర్లకు ఒక న్యాయం…బడా మిల్లర్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
కాసులిస్తే ఉన్నతస్థాయి అధికారులను సైతం తప్పుదోవ పట్టించే స్థాయిలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెగబడుతున్నారని, ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమవుతున్నారన్నారు.
వనపర్తి మండలంలో అసంపూర్తిగా ఉన్న ఓ బియ్యం మిల్లుకు పూర్తి స్థాయిలో యంత్రాలు ఏర్పాటు చేయని, విద్యుత్తు కనెక్షన్ లేకపోయినా ధాన్యం కేటాయించారని, వీటిలో 47 వేల బస్తాలు దారి మళ్లినట్లు ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తని ఖీల్లో బయటపడిందన్నారు.
మిల్లుల్లో మర ఆడించే యంత్రాలు తొలగించి ఏడాదైనా అధికారులకు సమాచారం లేకపోవడం విస్తు గొలిపే అంశమని, సీఎంఆర్ ధాన్యం కేటాయించిన మిల్లులు ఎక్కడ ఉన్నాయి? అవి మర ఆడిస్తున్నాయా? లేవా? అనేది కూడా తెలియని దుస్ధితి జిల్లాలో నెలకొందన్నారు.
కొందరు అధికారులు నిబంధనల్లోని చిన్న చిన్న వెసులుబాటును ఆసరాగా చేసుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లా పౌరసరఫరాల శాఖలో ఓ ప్రైవేటు వ్యక్తి అన్నీ తానై కార్యకలాపాలు సాగిస్తున్నాడని, ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైందని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డీఎస్ఓ అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టరుకి, సివిల్ సప్లయ్ కమిషనర్ కి మరియు డీజీ (విజిలెన్స్) కి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్న జిల్లా ఉన్నతాధికారుల తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, ఆర్టీఐ విభాగం ఉపాధ్యక్షులు రాఘవేందర్, శ్రీరంగపురం మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్ మ్యాదరి రాజ, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
