
ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటి జారీ చేపడుతామని పేర్కొన్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలోలా ఎక్కడా వ్యక్తుల చిత్రాలు కార్డులపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ పూర్తయిన తర్వాత ఎంత మందికి కొత్త కార్డులు ఇవ్వాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, బాధ్యులపై పీడీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రూ.1,600 కోట్లతో ఎండీయూ వాహనాలను కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని, ఇది పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని మనోహర్ తెలిపారు. కొన్ని వాహనాలు కనబడకపోగా, మరికొన్ని పనిచేయడం లేదన్నారు. అప్పుడున్న ప్రమాణాల ప్రకారం వీటి కొనుగోలు జరగలేదన్నారు.బియ్యం ఎగుమతుల నిబంధనలను కేంద్రం సరళతరం చేయడం వల్ల.. తెలంగాణ ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం కింద వచ్చే విద్యా సంవత్సరం నుంచి 44,394 ప్రభుత్వ పాఠశాలలు, 3,938 వసతి గృహాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్‌తో ప్రతి నెలా పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, 5 గోదాములు ఏర్పాటు చేశామని తెలిపారు.
