TEJA NEWS

హరీష్ రావుకు పొగ.. బీఆర్ఎస్ లో సెగ..!!

తెలంగాణ రాజకీయాలలో పేలనున్న బాంబు కేసీఆర్ రాజకీయవారసత్వం కోసం కేటీఆర్, కవిత పోటీ అన్నాచెళ్లెళ్ల పోరులో హరీష్ ను దూరం పెడుతున్న అధినేత నిప్పు లేకుండా పొగ రాదు అంటారు.

ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో వినవస్తున్న వార్తలు కూడా అలాంటివేనా? బీఆర్ఎస్ లో త్వరలోనే నిట్టనిలువుగా చీలక ఏర్పడనుందా? మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు విషయంలో వినవస్తున్న కథనాలు బీఆర్ఎస్ లో ముసలాన్ని సచిస్తున్నాయా? ఇన్నాళ్లూ నివురు గప్పిన చందంగా ఉన్న పార్టీలోని విభేదాలు ఇప్పుడు బహిర్గతం కానున్నాయా?

అంటే ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లూ బీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉన్న మీడియా వర్గాల నుంచే ఇటువంటి లీకులు రావడంతో అందరూ నిప్పు లేకుండా పొగరాదు.. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే..

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లయిన సందర్భంగా వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆరే అని పార్టీ నేతలకు, క్యాడర్ కు పరోక్షంగా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగ సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లలో తన ఫొటోయే కాకుండా కేటీఆర్ ఫొటో కూడా ప్రముఖంగా ఉంచడం ద్వారా తన రాజకీయ వారసుడు, పార్టీ భవిష్యత్ అధ్యక్షుడు కేటీఆర్ అని చాటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ కేటీఆర్ పాల్గొన్న సభలలో మాత్రమే కేసీఆర్ తో పాటు కేటీఆర్ చిత్రాలూ ప్రముఖంగా ఉండేవి.

కేసీఆర్ పాల్గొన్న సభలో అయితే వేదికపై ఎందరున్నా బ్యానర్లలో కేసీఆర్ ఫొటో మాత్రమే ఉండేది. తొలి సారిగా వరంగల్ సభలో మాత్రమే కేసీఆర్, కేటీఆర్ లకు సమప్రాధాన్యత నిస్తూ బ్యానర్లు, ఫొటోలు వెలిశాయి. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిందేమిటంటే.. మొత్తం సభా వేదిక, ప్రాంగణంలో ఎక్కడా హరీష్ రావు ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేకుండా పోయింది.

ఆఖరికి సంత మీడియాలో కూడా హరీష్ రావు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హరీష్ సెంట్రిక్ గా పార్టీలో చీలిక అంటూ లీకుల మీద లీకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే హరీష్ రావు సొంతగా పార్టీ ఏర్పాటు చేయనున్నారనీ, దాని పేరు టీఆర్ఎస్ అనీ పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒక మధ్యవర్తి ద్వారా హరీష్ రావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారనీ, త్వరలో ఆయన సైకిలెక్కే చాన్స్ ఉందనీ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

కేవలం తెలుగుదేశం గూటికి చేరడమే కాకుండా.. ఆ పార్టీ తెలంగాణ సారథిగా పగ్గాలు అందుకుని..వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అత్యంత కీలకమైన, ప్రధానమైన పాత్ర పోషించనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ కూడా కేసీఆర్ వెన్నంటి ఉండి.. పార్టీ నిర్మాణంలో, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్రపోషించి, కేసీఆర్ రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందినది హరీష్ రావే.

అయితే తెలంగాణ ఉద్యమం జోరందుకున్న తరువాత విదేశాల నుంచి కేటీఆర్ వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మెల్లిమెల్లిగా హరీష్ రావు ప్రాధాన్యత పార్టీలో తగ్గడం మొదలైంది. ఉద్దేశ పూర్వకంగా హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నం స్వయంగా కేసీఆర్ చేశారని పార్టీ వర్గాలే చెబుతూ వస్తున్నాయి. ముఖ్యంగా రెండో సారి బీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో తొలుత హరీష్ రావుకు స్థానం కూడా అభించలేదు.

ఇవన్నీ హరీష్ రావును పక్కన పెట్టి, ఆయన ప్రాధాన్యత తగ్గించడానికి ఒక ప్రణాళిక మేరకు జరిగిన ప్రయత్నంగా పార్టీ వర్గాలే చెబుతూ వస్తున్నాయి. సరే ఇక ఇప్పుడు హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేసి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారనీ, హరీష్ రావు పార్టీని వీడితే ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కేడర్, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులూ కూడా నడుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త్వరలో కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారు.

కేసీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో పార్టీలో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. చూడాలి ఈ సారి కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా హరీష్ పార్టీ మార్పు వ్యవహారం ప్రచారానికే పరిమితమౌతుందా? లేక కేసీఆర్ కు ఝలక్ ఇస్తూ నిజంగానే పార్టీ వీడి హరీష్ తన దారి తాను చూసుకుంటారా..