
ముగిసిన హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్:
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎక్స్‌అఫీ షియో సభ్యులు, కార్పొరే టర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
112 మంది ఓటర్లకుగాను 88 మంది ఓటు వేశారు. 78.57 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అనురాగ్ జయంతి తెలిపారు. మజ్లిస్ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించు కోగా.. పార్టీ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 24 మంది పోలింగ్‌లో పాల్గొనలేదు. మజ్లిస్ ప్రజాప్రతినిధులు 50 మంది; బీజేపీ నుంచి 24 మంది; కాంగ్రెస్ నుంచి 14 మంది ఓటు వేశారు. 31 మంది ఎక్స్అఫీషియో సభ్యులకు గాను 22 మంది, 81 మంది కార్పొరేటర్లకుగాను 66 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. మధ్యాహ్నం 2 గంటలకల్లా 88 మందీ ఓటేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మజ్లిస్ ఎంపీ అసదు ద్దీన్ ఒవైసీ జీహెచ్ఎంసీ ఆఫీసులోని భవన నిర్వ హణ విభాగం గదిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో, కార్పొ రేటర్లు లైబ్రరీ హాల్లోని కేంద్రంలో ఓటేశారు.
పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలో భద్రపర్చారు. 25న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొందరు ఓటింగ్‌కు వస్తు న్నారని ప్రచారం జరిగిన ప్పటికీ.. ఎవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటేనని, మజ్లీస్ ను నిలువరించేది బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్‌రావు చెప్పారు.
