TEJA NEWS

అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి!

హైదరాబాద్:
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారం భిస్తామ‌ని, మంత్రి అన్నారు.

వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీగా పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనానికి మరమ్మ‌తులు పూర్తి చేయించి ఈ నెలా ఖరులో ప్రారంభిస్తామని తెలిపారు. మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొంది స్తామని తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు, అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.

విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42.00 కోట్లను ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేశామ‌న్నారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.