గంజాయిపై ఉక్కుపాదం…నస్పూర్‌లో ఆకస్మిక తనిఖీలు

TEJA NEWS

గంజాయిపై ఉక్కుపాదం…
నస్పూర్‌లో ఆకస్మిక తనిఖీలు – మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు….

—ఎస్సై ప్రశాంత్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: నస్పూర్,
గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్స్ వింగ్, మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీసుల సమన్వయంతో ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్పూర్ కార్నర్ ప్రాంతం, ఆటో స్టాండ్ పరిసరాలు, హోటళ్లు, పాన్ షాపులు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు, హోటళ్ల పరిసరాలు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top