
రైతుల కోసమంటూ జగన్ కొత్త డ్రామ
ఐదేళ్ల పాలనలో 14 మంది రైతుల ఆత్మహత్య
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట:అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్ రైతు సమస్యలను గాలికి వదిలివేసి, మిర్చి రైతుల కోసం ఉద్యమాలు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు.
జగన్‌కు వ్యవస్థలపై గౌరవం లేదు..
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ, పోలీస్, ప్రభుత్వ వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం ఉండేది కాదని, అధికారం కోల్పోయినా జగన్ తీరు మారలేదని బాలాజి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, జగన్ గుంటూరు మిర్చీ యార్డు పర్యటనకి అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పినా, పోలీస్ శాఖ కూడా అనుమతి నిరాకరించినా .. జగన్ వేలాది మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని బలప్రదర్శన చేశారని, రైతులను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నారన్నారని. రైతు భరోసా నిధులు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్ మోసం చేశారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేది కూటమి ప్రభుత్వమని వెల్లడించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం లేదా కూటమి ప్రభుత్వ వైఫ్యల్యాలపై జగన్ తప్పకుండా పోరాడవచ్చు. కానీ ఆ పేరుతో చట్టాలను ధిక్కరిస్తూ, పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నించారని, గంటల సేపు మిర్చియార్డుతో పాటు, పరిసరప్రాంతాల్లో కార్యకలాపాలు స్థంబింపచేశారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్‌ను, ఆయన అనుచరులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
