
కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి రైతులకు నీరందించాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్…
పెద్దపల్లి జిల్లా ప్రతినిథి: కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించి వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులకు తరలించి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జెడ్పీటీసీ గంట రాములు, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌ను సందర్శించి అక్కడ సమృద్ధిగా నీరు ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీకి, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరమే ఉండగా, ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపులను ప్రారంభించకుండా వివిధ సాకులు చెబుతోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా పంపింగ్ ద్వారా రిజర్వాయర్లు, చెరువులను నింపి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని, మూడు బ్యారేజీలు, 19 పంప్‌హౌస్‌లు, 21 సబ్స్టేషన్లు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల సొరంగాలతో కూడిన భారీ సాగునీటి వ్యవస్థ అని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లో 41 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా రూపకల్పన చేశారని చెప్పారు.
మేడిగడ్డలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని, వాటిని మరమ్మతు చేయవచ్చని సంబంధిత సంస్థలు సూచించినప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిపేర్లు చేపట్టడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరమ్మతులు చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
రైతులకు సాగునీరు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, యూరియా, రైతుబంధు, బోనస్ వంటి అంశాల్లోనూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లక్ష మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
