
గడ్డివాములో రాజుకున్న అగ్ని
– స్థానికుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం
ఎడ్లపాడు గ్రామంలోని మేదర వీధిలో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. మహాలక్ష్మమ్మ చెట్టు సమీపంలో కొండ సాంబయ్యకు చెందిన వరిగడ్డి వాములో ఉదయం 10.30 గంటల సమయంలో అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. సమీపంలోని ఇంటి వద్ద పనులు చేస్తున్న వారు, గమనించి సత్వరమే స్పందించి మోటర్ సాయంతో నీళ్లు కొట్టారు. క్షణాల్లో జెసిబిను అక్కడికి తీసుకువచ్చి వామును పక్కకు నెట్టి మంటల వ్యాప్తిని పెరగకుండా చేశారు. వాముకు అతి దగ్గరలో ఉన్న గేదెలను సకాలంలో కట్లు విప్పి బయటకు పంపించేశారు. స్థానికుల సమయస్పూర్తి, ఆత్మస్థైర్యం వల్ల మంటలు మరింత వ్యాపించకముందే ఆర్పివేయడంతో అంతా పెనుప్రమాదాన్ని తప్పించారని ఊపీరి పీల్చుకున్నారు. అయితే ఈ మంటలు ఆకతాయిల కారణంగా రాచుకున్నవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
