Spread the love

కిషన్ రెడ్డి రావాలి- హక్కులపై మాట్లాడాలి- డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో జరిగే సమావేశం కంటే ముందే రాష్ట్రంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు. దీనికి కిషన్ రెడ్డి సహా ఇతర నేతలు రావాలని సూచించారు.

భారత దేశంలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ఉద్యానికి మద్దతు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర పూరితంగానే దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు కదలాలని పిలుపునిచ్చారు.

మార్చి 22న జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ప్రతినిధుల బృందం ఆయా సీఎంలతో సమావేశమై ప్రత్యేకంగా ఆహ్వానించనుంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అహ్వానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త‌మిళ‌నాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వ‌ర్యంలోని డీఎంకే ప్ర‌తినిధి బృందం ఢిల్లీలో క‌లిశారు. త‌మిళ‌నాడు సీఎం త‌ర‌ఫున సభకు ఆహ్వానించారు. నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు జరిగే న‌ష్టంపై చర్చించారు. దీనిపైనే చర్చించేందుకు 22న జరిగే దక్షిణాదిలోని కీలక నేతలను ఆహ్వానిస్తున్నట్టు డీఎంకే బృందం తెలిపింది.

డీఎంకే ప్రతినిధులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీకి ప్రాధాన్యత ఉండటం లేదని అన్నారు. అందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది డీలిమిటేషన్ కాదని… దక్షిణాది పరిధి తగ్గించే ప్రయత్నమని ఆరోపించారు.

బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం అనుమతి తీసుకొని వెళ్లే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే” బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టేది డీలిమిటేషన్ కాదు. దక్షిణాది పరిధిని కుదించడమే. దీన్ని మేం అంగీకరించబోం. నార్త్‌తో పోలిస్తే మేం చాలా పన్నులు కడుతున్నాం. చాలా కంపెనీలు ఉన్నాయి. ఆంత్రపెన్యూర్లు కూడా అక్కడే ఎక్కువ ఉన్నారు. అందుకే దక్షిణాదికి వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు చేస్తోంది. అక్కడ బీజేపీ విస్తరణకు అవకాశం ఇవ్వడం లేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటక తెలంగాణలో వాళ్లు అధికారంలో లేరు. రాలేరు. అందుకే దీన్ని సెటిల్ చేయడానికి ఇప్పుడు డీలిమిటేషన్ అంటూ కుట్ర చేస్తున్నారు. ” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు అందర్నీ ఏకం చేయడం అవసరం. అందులో భాగంగా స్టాలిన్ ఏర్పాటు చేసిన మీటింగ్‌ను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి కీలకమైన మీటింగ్‌కు హాజరవ్వాలని కాంగ్రెస్ ప్రాథమికంగా అంగీకరించింది అన్నారు. కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకొని అధికారికంగా ప్రకటన చేస్తామని తెలిపారు.

తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో దీనిపై చర్చించాలని నిర్ణయించామన్నారు రేవంత్ రెడ్డి. అందుకే అన్ని పార్టీలను ఆహ్వానించి అఖిలపక్షం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. స్టాలిన్ ఏర్పాటు చేసే మీటింగ్‌కు వెళ్లే లోపు తెలంగాణలో అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమస్య ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదన్నారు. దక్షిణాదిలో ఉండే ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రక్రియని అందోళన వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్‌ ఇష్యూ పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సమస్యగా అభివర్ణించారు. అందుకే పార్టీలకు అతీతంగా అందర్నీ ఆహ్వానిస్తామన్నారు రేవంత్. దక్షిణాదిలో ఉన్న బీజేపీ నేతలను కూడా పిలుస్తామన్నారు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్‌ కిషన్‌ రెడ్డిని కూడా ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి జానారెడ్డికి చెప్పినట్టు సీఎం తెలిపారు. ఆయన కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తాలని సూచించారు. మార్చి 22న జరిగే మీటింగ్ తర్వాత పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని రేవంత్ తెలిపారు. దీనికి నాయకత్వం వహిస్తున్న స్టాలిన్‌ను ప్రోత్సహిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.