TEJA NEWS

ప్రజా పాలనలో విద్యార్థులపై లాఠీచార్జి సిగ్గుచేటు

హెచ్‌సీయూ భూమిపై ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే పోరాటం ముదురుతుందని హెచ్చరిక

ప్రజా భూమి కాపాడే వరకు పోరాటం ఆగదంటూ

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ స్పష్టం.

పోలీసుల అదుపులో విద్యార్థి నాయకులు—సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయకూడదని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన “చలో సెక్రటేరియట్” కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించగా, పోలీసులతో ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ, భూమిని యూనివర్సిటీకి రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనను అణచివేయడానికి ప్రయత్నించగా, విద్యార్థి సంఘాల నాయకులు వారిని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రాథోడ్ ఆకాష్ నాయక్ సహా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ, ప్రజల ఆస్తిని వేలం వేయడం అన్యాయమని ఆరోపించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 400 ఎకరాల భూమిని హెచ్‌సీయూకు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన అప్రజాస్వామిక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేని యెడల ప్రభుత్వానికి గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు. పోలీసుల లాఠీచార్జిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. “మహిళలను కూడా చూడకుండా లాఠీచార్జి చేయడం సిగ్గుచేటు,” అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారని సమాచారం. ప్రజాస్వామ్యంలో విద్యార్థులపై దౌర్జన్యం జరగడం గర్హనీయమని వారు అన్నారు. ఈ ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వంశి వర్ధన్ రెడ్డి, జిల్లా గర్ల్స్ కన్వీనర్ శ్రావణి, ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ గౌడ్, చింత వెంకటేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చైతన్య, నల్గొండ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి..