
తిరుపతి అభివృద్ధే ధ్యేయంగా పనిచేద్దాం.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
ప్రజాభివృద్ధి పనులకు ప్రాధాన్యత – కమిషనర్ ఎన్.మౌర్య
అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన కౌన్సిల్
తిరుపతి నగరపాలక సంస్థ
తిరుపతి నగర అభివృద్దే ధ్యేయంగా అందరూ కలసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేటర్లు, అధికారులకు పిలుపునిచ్చారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కమిషనర్ ఎన్.మౌర్య అజెండాను ప్రవేశ పెట్టారు. కౌన్సిల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎల్.సి. సిపాయి సుబ్రమణ్యం హాజరయ్యారు. అంతకు ముందు డిప్యూటీ మేయర్ గా ఆర్.సి.మునికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్లు ఆయన్ను అభినందించారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, అధికారులు హాజరైన కౌన్సిల్ సమావేశంలో ముందు సెక్రటరీ రాధిక బడ్జెట్ ను ప్రవేశపెట్టగా పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం మేయర్ శిరీష తో పాటు కొంతమంది కార్పొరేటర్లు సమావేశం నుండి బయట వెళ్ళారు. 12 గంటలకు జరగాల్సిన అజెండా అంశాల సాధారణ సమావేశంకు మేయర్, కార్పొరేటర్లు రాలేదు. తదుపరి సమావేశం నిర్వహించేందుకు తగినంత కోరం సభ్యులు ఉన్నందున, సీనియర్ సభ్యులైన డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పేరును డిప్యూటీ మేయర్ మునికృష్ణ ప్రతిపాదించగా, సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఆయనకు మేయర్ హోదా కల్పించడంతో కౌన్సిల్ అజెండా పై చర్చించి ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తిరుపతిలో పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన అభివృద్ధి జరగలేదని అన్నారు. ఇకనైనా అధికారులు, కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా సమన్వయంతో తిరుపతి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇటీవల కమిషనర్ మౌర్య స్కావెంజర్స్ కాలనిలో చేసిన అభివృద్ధి పనులు అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. నగరంలో సుందరీకరణ పనులు బాగా చేస్తున్నారని, రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా పూడ్చామని అన్నారు. సమష్టిగా, సమన్వయంతో పనులు చేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ ప్రజాభివృద్దే ధ్యేయంగా పనులు చేస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగేలా నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. అధికారులు చేసే అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు సహకరించాలని అన్నారు. అభివృద్ధి పనులకు తాము ఎప్పుడు బాసటగా నిలుస్తామనీ, వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
