TEJA NEWS

తరుగు పేరుతో రైతులకు మిల్లర్లకుచ్చుటోపి

మంత్రి ఆదేశాలనే విస్మరిస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు
రైతులను ఇబ్బంది పెడితే సహించం
— బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలను సివిల్ సప్లయ్ అధికారులు విస్మరిస్తున్నారని, రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరించారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆడిషనల్ కలెక్టరును కలిసి మిల్లర్లు చేస్తున్న దోపిడిపై వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైస్ మిల్లర్ల ఆగడాలు అధికమయ్యాయని, ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు వరి ధాన్యం కొనుగోలుపై జిల్లా స్థాయి అధికారులతో జరిపిన సమీక్ష సమావేశాన్ని సైతం మిల్లర్లు బేఖాతర్ చేశారని మండిపడ్డారు.

మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష చేసిన తర్వాత కూడా మిల్లర్లు రైతులను తరుగు పేరుతో మోసం చేస్తున్నారంటే వారికి సివిల్ సప్లయ్ అధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

చిట్యాల గ్రామానికి చెందిన మాల బాలస్వామి అనే రైతు తను పండించిన 872 బస్తాల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కొనుగోలు చేసినప్పుడే రైతు నుండి తరుగు పేరుతో బస్తాకు 1200 గ్రాముల చొప్పున అధికంగా తూకం చేయడం జరిగిందన్నారు.

కానీ కేతేపల్లి కి చెందిన మైరూన్ అనే రైస్ మిల్లు యజమానులు రైతుకు 835 బస్తాలకే లెక్క కట్టి, 37 బస్తాలు తగ్గించి రసీదు ఇవ్వడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

శ్రీలక్ష్మి రైస్ మిల్ యజమాని కూడా ఆరేపల్లికి చెందిన మహబూబ్ అనే రైతు వద్ద క్వింటాలుకు ఐదున్నర కేజీలు అదికంగా తరుగు తీశారన్నారు.

రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వాల్సిన ట్రక్ షీట్ ఇవ్వకుండా రైస్ మిల్లు దగ్గర ఇస్తున్నారని, ఈ విధమైన నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదేవిధంగా చాలా మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీస్తున్నారని దీనిపై సమగ్ర విచారణ జరిపి మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారికి లోపాయికారిగా వత్తాసు పలుకుతున్న సివిల్ సప్లయ్ అధికారుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండు రోజుల క్రితం మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ జరిపిన సమీక్ష సమావేశానికి కనీస విలువ చూపని మిల్లర్లపై ఏమి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్,పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్, ఉపాధ్యక్షుకు రేనట్ల మల్లేష్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్,రవి నాయుడు, రైతులు చిట్యాల బాలస్వామి, ఆరేపల్లి మహబూబ్, రవి సాగర్ తదితరులు పాల్గొన్నారు.