ధాన్యం దగ్ధంతో నష్టపోయిన రైతులకు అండగా ఎమ్మెల్యే విజయరమణ రావు

TEJA NEWS

ధాన్యం దగ్ధంతో నష్టపోయిన రైతులకు అండగా ఎమ్మెల్యే విజయరమణ రావు….

పెద్దపల్లి// పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గాంధీనగర్‌లో ప్రమాదవశాత్తు వరి ధాన్యం కుప్పలు, పంట పొలం దగ్ధమైన ఘటన బాధాకరమని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హామీ ఇచ్చారు.
అగ్నిప్రమాదంలో రైతులు తోట రామకృష్ణ, తోట రాకేష్‌లకు చెందిన వరి ధాన్యం, పంట పొలం దగ్ధమైన నేపథ్యంలో ఎమ్మెల్యే విజయరమణ రావు ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి తన వంతుగా నగదు సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ధాన్యం కాలిపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న నష్టం ఎంతో బాధాకరమని అన్నారు. బాధిత రైతులు అధైర్యపడవద్దని, వారి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

గాంధీనగర్‌లో నష్టపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top