
ఆదానీ కోసం దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ చర్యలు దుర్మార్గం
కూనంనేని సాంబశివరావు, సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు
భారతదేశాన్ని లూటీ చేస్తున్న ఆదానీపై అమెరికాలో నమోదైన అవినీతి, లంచం కేసులో తప్పించడానికే మోడీ ఇటీవల అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం అయ్యాడని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ పొట్లూరి నాగేశ్వర్రావు భవన్ లో జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి కూనంనేని సాంబాశివారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ అమెరికా వెళ్లి ట్రంపును కౌగిలించుకోవడం ధృతరాష్ట్ర కౌగిలిగా మారిందని కేవలం వ్యాపారస్తుల కోసం వెళుతున్నాడే కానీ అమెరికాను భారతదేశ పౌరులను సంకెళ్లు వేసి పంపిస్తుంటే కనీసం ఖండించకుండా ట్రంప్ ని పొగడడం మోడీకే చెల్లిందని, మోడీ విధానాల వల్ల భారతీయులకు అవమానకరంగా మారిందని, అదేవిధంగా దేశంలో మోడీ మత రాజకీయాల వల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోయాయని, అంతేకాకుండా కుటుంబ సభ్యులను కూడా విడదీసి పరిపాలన సాగిస్తున్నాడని ఇలా కేవలం తన పదవి కోసం అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, దీనిని కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కేసీఆర్ కమ్యూనిస్టుల గురించి నిన్న మాట్లాడడం సిగ్గు చేటని,ఫామ్ హౌస్ లో ఉండి ప్రజాస్వామ్యం పై చిత్తశుద్ధి లేని కెసిఆర్ తన రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి గాని కమ్యూనిస్టుల గురించి మాట్లాడే హక్కు లేదని ముందుగా తనని ఎన్నుకున్న ప్రజల కోసం ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ అవలంబించిన విధానాలనే అవలంబిస్తున్నారని ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని, వెంటనే ఆర్టీసీ కార్మికుల యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికల నిర్వహించి ప్రజాస్వామ్యత వాతావరణాన్ని కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ వదిలిన చొక్కాలను తొడుక్కొని అనేక నిర్ణయాలు తీసుకుంటుందని కావున వెంటనే అటువంటి విధానాలను సమీక్షించుకొని కమ్యూనిస్టులు సూచించిన విధంగా ప్రజా సంక్షేమ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇదే విధమైన ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే కమ్యూనిస్టులు కచ్చితంగా పోరాడుతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.సీపీఐ ఏర్పడి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్రం యొక్క అన్ని జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో పార్టీని పునర్నిర్మాణం కోసం మహాసభ నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో ఖమ్మంలో ఐదు లక్షల మందితో అతిపెద్ద బహిరంగ సభను నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ ప్రాంతంలో కుత్బుల్లాపూర్ లో జగద్గిరిగుట్ట ప్రాంతంలో 3000 ఎకరాలను 25వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంచిన చరిత్ర సిపిఐ కి ఉన్నదని, అదే ఒరవడిని కొనసాగిస్తూ నేడు కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కొరకు సిపిఐ చేసిన పోరాట ఫలితంగా 25 ఎకరాలను కేటాయించడం జరిగిందని, పరికిచెరువు పరిరక్షణ కొరకు చేసిన ఉద్యమం వల్ల హైడ్రాధికారులు చెరువును పరిరక్షించడానికి చర్యలు మొదలుపెట్టారని ఇవి సిపిఐ సాధించిన ఫలితాలని, రానున్న రోజుల్లో బస్ డిపో ఏర్పాటు కొరకు, గురుకుల పాఠశాలల కొరకు ఉద్యమిస్తామని, గాజులరామారంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి కూడా సిపిఐ పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. మేడ్చల్ జిల్లాలో కూడా రాబోవు స్థానిక ఎన్నికల్లో పార్టీని నిలబెట్టి అనేక స్థానాలను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పతాకాన్ని కార్యాలయం ఎదురుగా ఆవిష్కరించడం జరిగింది. సమావేశానికి ముందు ప్రజా ఉద్యమాలలో అమరులైన వారికి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ విఎస్. బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ యూసూఫ్, జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్,ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేసు రత్నం, జిల్లా సహాయ కార్యదర్శులు జీ. దామోదర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు హరినాధ్ రావు, స్వామి, శంకర్, వెంకట్ రెడ్డి, కల్లూరు ధర్మేంద్ర, జె. లక్ష్మీ, మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు సత్య ప్రసాద్, బాలరాజ్, శ్రీనివాస్,లొట్టి ఈశ్వర్, జయచంద్ర, లక్ష్మీ నారాయణ, సహదేవ్, నరేంద్ర ప్రసాద్, ప్రమీలా, మాధవి తదితరులు పాల్గొన్నారు.
