
ధర్మారం అభివృద్ధికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శ్రీకారం….
రూ.20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో గట్టిగా పోరాడతామని స్పష్టం….
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న బోర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ధర్మపురి–కోటిలింగాల ఆలయాలకు వేల ఏళ్ల చరిత్ర ఉందని, ఈ ప్రాంతాన్ని “టెంపుల్ సిటీ”గా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు.
రాజకీయ అంశాలపై స్పందిస్తూ, అయోధ్య రామాలయ నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, రాముడి పేరును బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని విమర్శించారు. అలాగే పార్లమెంట్లో మెజారిటీ కోసం ఇతర పార్టీల ఎంపీలను ఆకర్షించే రాజకీయాలు జరుగుతున్నాయని, సీబీఐ, ఈడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర హక్కులు, అభివృద్ధి అంశాలను బలంగా ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
అనంతరం ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాలకుర్తి చిన్న రాజేశం గౌడ్, అమరగోని అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.