
శ్రీ దుర్గమ్మకు సంగీతార్చన
ఆకట్టుకున్న వనిత సురేష్ భక్తి గీతాలాపనలు
సకల కళా ప్రియ అయిన కనకదుర్గమ్మవారికి శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై సంగీతార్చన జరిగింది.
ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి వనిత సురేష్ గాత్ర కచేరి తో ఇంద్రకీలాద్రిపై భక్తులు పరవశించారు.
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కళావేదిక కేంద్రంగా శ్రీమతి వనిత సురేష్ తమ బృందం తో గాత్ర
కచేరి చేశారు. మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు అమ్మవారి కీర్తనలు ఆలపించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ శాస్త్రీయ సంగీతం మీద ఆసక్తితో గత 15 సంవత్సరాలుగా ఇండియా లోని అనేక ప్రాంతాల్లో గాత్ర కచేరి ప్రదర్శనలు ఇస్తున్నానని వనిత సురేష్ తెలిపారు.
అంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో స్వరార్చణ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ఈ అవకాశం కల్పించిన పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) కు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ రామ చంద్ర మోహన్,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వీనుల విందుగా సాగిన ఈ గాత్ర కచేరి ప్రదర్శనలో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ మల్లాది రవికుమార్ తనయుడు శ్రీ మల్లాది శివానంద్ మృదంగం పై, కుమారి సింధు రాగేశ్వరి వయొలిన్ పై వాద్య సహకారం అందించారు.
కార్యక్రమం అనంతరం కళా బృందం అమ్మవారిని దర్శించుకున్నారు.
వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం ప్రసాదాలు అందజేశారు.
