TEJA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలోజాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం (సైన్స్ డే) సందర్భంగా నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ -2025 ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

సభా ప్రాంగణంలో శాస్త్ర రంగంలో దిగ్గజులైన దివంగత భారతరత్నాలు సీవీ రామన్ , అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మేరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు. దేశ రక్షణ రంగానికి ముఖ్య కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని కోరారు.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్- 2025 ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. సభా ప్రాంగణంలో శాస్త్ర రంగంలో దిగ్గజులైన దివంగత భారతరత్నాలు సీవీ రామన్ , అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించారు..

“తెలంగాణ రాష్ట్రం.. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీడీఎల్, డీఆర్‌డీఓ, మిథాని, హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

దేశ రక్షణ రంగానికి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య “హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్”ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనూ కోరాం.

“హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్” ఏర్పాటు ద్వారా రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయి. స్కైరూట్ లాంటి స్టార్టప్, ప్రైవేటు సంస్థలు ఇప్పటికే రాకెట్లను తయారు చేస్తున్నాయి. కారిడార్ ప్రకటన రక్షణ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుంది.

హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ సహకారం, మద్దతు ఎంతో అవసరం. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వంగా మేము ప్రయత్నిస్తాం.

దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపైనే ఉంది. ఐటీ నిపుణులతో పాటు సంప్రదాయ కోర్సులు చదివే ఇంజనీర్ల అవసరం కూడా మన దేశానికి చాలా ఉంది. యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం.

లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించి, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తి నింపడంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉపయోగపడతాయి” అని ముఖ్యమంత్రి తెలిపారు.