
సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి…..
12వ.వేజ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి ఏఐటీయూసీ హెచ్చరిక…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించకపోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు.
ఆర్జీ-1 ఏరియాలోని ఓసీపీ-5 వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను వేలం ప్రక్రియకు దూరంగా ఉంచి సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కోసం 2012లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి “సేవ్ సింగరేణి” ఉద్యమం చేపట్టి ఆ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేలా కృషి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థ నష్టపోతోందని విమర్శించారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ సంస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకోకుండా నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎండీఆర్ చట్టం కారణంగానే సింగరేణికి కొత్త గనులు రావడం లేదని పేర్కొన్నారు.
సింగరేణి యాజమాన్యం గుర్తించిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం నుంచి తొలగించి, తాడిచర్ల-2 బ్లాక్‌ను కేటాయించిన తరహాలోనే సింగరేణికే అప్పగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ యాత్రలు, భరోసా కార్యక్రమాలతో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
సింగరేణి కార్మికుల 31 డిమాండ్లపై ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని, రెండు విడతల చర్చలు జరిగినప్పటికీ ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వెంటనే 12వ వేజ్ బోర్డు ఏర్పాటు, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిల విడుదల, ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్, మారు పేర్ల సమస్య పరిష్కారం, మెడికల్ బోర్డు కొనసాగింపు, సొంతింటి పథకం అమలు వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోతే ఆగస్టు నెలలో ఇతర కార్మిక సంఘాలతో కలిసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి సింగరేణిని పరిరక్షించుకోవాలని, కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి ఓసీపీ-5 ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తదితరులు ప్రసంగించారు. నాయకులు మాదన మహేష్, బోగ సతీష్‌బాబు, గండి ప్రసాద్, ఎడవెల్లి రాజిరెడ్డి, సదయ్య, ఉదయభాను, రవీందర్, నర్మద, అంజన్న, మడ్డి కిరణ్, పాపన్న, పరుశురాం, శ్రీనివాస్, సురేష్, పర్లపెల్లి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.