Spread the love

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఆర్వోలదే కీలక పాత్ర

ఏ చిన్న పొరపాటుకు తావివ్వొద్దని ఆదేశించిన జిల్లా రెవెన్యూ అదనపుకలెక్టర్ వెంకటేశ్వర్లు

వనపర్తి
వనపర్తి జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఆర్వోలదే కీలక పాత్ర అని, ఏ చిన్న పొరపాటుకు తావు ఇవ్వొద్దని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు.

    జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం ఆర్వోలు, ఏఆర్వోలకి ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జెడ్పిటిసి ఎన్నికల కోసం 17 మంది ఆర్వోలు, ఎంపీటీసీ ఎన్నికల కోసం 53 మంది ఆర్వోలు, మరో 53 మంది ఏఆర్వోలు హాజరయ్యారు. 

       ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ   ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణలో నామినేషన్ల ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు ఆర్వోలది కీలకపాత్ర ఉంటుందని, ఏ చిన్న పొరపాటుకు తావు ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినప్పుడు, సంబంధిత డాక్యుమెంట్లు, వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోవాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్తికి ప్రతిపాదిత వ్యక్తుల హాజరు, వారి వివరాలు, నామినేషన్ స్థానికత వివరాలు, నామినేషన్ ఫీజు సక్రమంగా తనిఖీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్లరికల్ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు.  తప్పనిసరిగా, అభ్యర్థుల సమక్షంలోనే స్క్రూటీని నిర్వహించాలని చెప్పారు. 

    ఎన్నికల నిబంధనలన్నిటిని నామినేషన్ల ప్రక్రియలో తూచా తప్పకుండా పాటించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో కారణం లేకుండా నామినేషన్లను తిరస్కరించడానికి వీలు లేదన్నారు. నామినేషన్లను తిరస్కరించే పక్షంలో తప్పనిసరిగా కారణాలను పేర్కొనాలని సూచించారు. 

     గురువారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆర్వోలకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, శిక్షణకు వచ్చే వారందరూ సకాలంలో హాజరుకావాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయబడతాయని చెప్పారు. 

      జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ రెడ్డి , ఏవో భాను ప్రకాష్, ఎన్నికల సిబ్బంది, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.