
పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర
** శిక్షణా తరగతిలో “తుడ” చైర్మెన్ డాలర్స్ దివాకర్
తిరుపతి: రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబులు అహర్నిశలు శ్రమిస్తున్న దరిమిలా అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్సులదే కీలకపాత్ర అని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడ) చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి చెప్పారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నానని దివాకర్ రెడ్డి అన్నారు. తుడ చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తుడా పరిధిలో లేవుట్ అప్రూవల్, భవన నిర్మాణాల అనుమతులు, అమలు తదితర అంశాల పై గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 4 మున్సిపాలిటీలు, 9 నియోజకవర్గాలు, 39 మండలాల ఎంపిడిఓలు , 1100 పైగా గ్రామ పంచాయతీల కార్యదర్సులకు శిక్షణా సదస్సు బుధవారం తిరుపతిలోని “కచ్చపి” ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి “తుడ” చైర్మన్ దివాకర్ రెడ్డి, తుడా వైస్ చైర్మన్ హోదాలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సురేష్ నాయుడు, మున్సిపల్ డిప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, తుడ సెక్రటరీ శ్రీకాంత్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుడ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ దేవీ కుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచాయతీల పరిధిలో కార్యదర్శులు అక్రమ లేఅవుట్లు ఎలా గుర్తించాలి, ఎలా అనుమతులు ఇవ్వాలి. భవన నిర్మాణాల అనుమతులు తదితర అంశాలను కూలంకశంగా వివరించారు. అదేవిధంగా పంచాయితీ కార్యదర్సుల అనుమానాలను నివృత్తి చేశారు. తుడా పరిధిలో ప్రతి గ్రామానికి రోడ్లు, త్రాగునిరు, డ్రైన్స్ అందిస్తాం అని చైర్మన్ దివాకర్ స్పష్టం చేశారు.
అక్రమ లేవుట్ లు, అనుమతులు లేని భవన నిర్మాణాలను నిత్యం పంచాయితీ కార్యదర్శులు గుర్తించి తమకు తెలపాలన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరానికి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజూ లక్షలాదిమంది భక్తులు వస్తున్నారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా దైవదర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళేవిధంగా అన్ని సౌకర్యాలు తుడా కల్పిస్తుందని వెల్లడించారు. సీ.ఆర్.డీ.ఏ పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణం శరవెగంగా జరుగుతోన్న స్ఫూర్తిగా తుడా పరిధిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత పాలకులు తుడాను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. తాను తుడా ఛైర్మెన్ అయ్యాక తుడా ను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. తుడా పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడానికి తుడా కృషి చేస్తుందని చెప్పారు. అక్రమ లేవుట్స్ వలన క్రైమ్ రేటు పెరుగుతోందని, ప్రజలు అక్రమ లేఔట్స్ లో స్థలాలు కొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శులు లేవుట్, భవన నిర్మాణాల అనుమతులు వాటి అమలు, తుడా నియమ నిబంధనలు తెలుసుకొని తుడా అభివృద్ధికి కృషి చేయాలనీ కోరారు. గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని, వారి హోదాకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామన్నారు.
