“పరకామణి చోరీ…” లోగుట్టు పెరుమాళ్ళకెరుక
** బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి: తిరుమల పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ ఎవరు?… ఎన్ని సంవత్సరాలుగా జీయర్ స్వామి మఠంలో పనిచేస్తున్నారు?….రవి కుమార్ ఎన్ని సంవత్సరాల నుంచి పరకామణి డ్యూటీకి వెళ్లి వస్తున్నారు? ఎవరితో కలిసి వెళ్తున్నారు?… రవికుమార్ పరకామణి డ్యూటీ కి వెళ్ళిన నాటి నుంచి 2023 చోరీ విషయం బయటపడే వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని మహాద్వారం,పరకామణి ప్రాంతాలలోని “సీసీ కెమెరా” ఫుటేజీలను డిలీట్ కాకుండా వెంటనే భద్రపరచండి అని బీజేపీ సీనియర్ నేత పీ.నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. పరకామణి డ్యూటీ కి వెళ్లే టిటిడి ఉద్యోగస్తులతో పాటు శ్రీవారి సేవకులను సైతం అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేసే టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఆ అధికారులు ఎవరు? అనే విషయాలు తేల్చాలని కోరారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది…. నిప్పుతో సమానం…. అలాంటి కానుకలను చోరీ చేసిన రవికుమార్ ను హైకోర్టు ఆదేశాల మేరకు సిబిసిఐడి అధికారులు వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ విదేశాలకు పారిపోకుండా “పాస్ పోర్ట్” సీజ్ చేయాలి.
పరకామణి చోరీ కేసులో నిజా నిజాలు నిగ్గు తేలే వరకు రవికుమార్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ చొరవతో పోలీసు రక్షణ కల్పించాలన్నారు.
పరకామణిలో రవికుమార్ కోట్లాది రూపాయల చోరీ సొత్తుతో అక్రమాస్తులు సంపాదించడం అనేక సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారాన్ని టీటీడీ పూర్వపు ఉన్నతాధికారులు, విజిలెన్స్ నిఘా వ్యవస్థ గుర్తించకపోవడం బాధ్యతరాహిత్యం అని వారందరినీ కూడా చోరీ విచారణలో భాగస్వాములుగా చేర్చాలన్నారు. హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి విచారణకు ఆదేశించడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) వేయబోతున్నామని చెప్పడం…. ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎంపీ సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో భక్తులలో గందరగోళం ఏర్పడిందని కాలయాపన జరగకుండా పరకామణి చోరీ “గుట్టు రట్టు” చేసి వాస్తవాలను చెప్పి దోషులను శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టాలన్నారు.
పరకామణి చోరీ కేసు విషయంలో విమర్శలు ప్రతి విమర్శలతో కాలయాపన చేయకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి శ్రీవారి సొమ్మును రికవరీ చేయాలన్నారు.
శ్రీవారి సొమ్మును చోరీ చేసిన రవికుమార్ లాంటి వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిన మఠాధిపతులను సైతం కేసులో భాగంగా విచారణ జరిపితే “నమ్మలేని నిజాలు” వెలుగులోకి వస్తాయన్నారు.
