అడవుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం.

TEJA NEWS

అడవుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం…

విలువ ఆధారిత అటవీ ఉత్పత్తులపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం…

–పెద్దపల్లి అటవీ శాఖ రేంజ్ అధికారి సతీష్ కుమార్…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, అటవీ ఉత్పత్తుల వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పెద్దపల్లి అటవీ శాఖ రేంజ్ అధికారి సతీష్ కుమార్ తెలిపారు.

కార్యక్రమాల్లో భాగంగా అంతర్గాం మండలం కుందనపల్లి, మంథని మండలం ఖాన్సాపేట్ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.
అంతర్గాం మండలం కుందన్‌పల్లి గ్రామంలోని అర్బన్ ఫారెస్ట్ పార్కులో స్థానిక గ్రామస్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీపురు గడ్డి (Broom Grass), తేనె, జిగురు, ఇప్ప పూలు వంటి అటవీ ఉత్పత్తుల ద్వారా విలువ ఆధారిత కార్యకలాపాలు, అలాగే వర్మీ కంపోస్ట్ తయారీ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌తో పాటు అటవీ శాఖ సిబ్బంది, 62 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

మంథని అటవీ రేంజ్ అధికారి వినయ్ నాయక్ ఖాన్సాపేట్ గ్రామస్తులకు కూడా అటవీ ఉత్పత్తుల సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఖాన్సాపేట్ సర్పంచ్, ఉప సర్పంచ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, 38 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అడవులపై ఆధారపడి జీవించే గ్రామస్తులు అటవీ ఉత్పత్తులను సేకరించేటప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. అడవుల సంరక్షణతో పాటు వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రీయ ఎరువుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను అన్వేషించాలని గ్రామస్తులను ప్రోత్సహించారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొమురయ్య, తిరుపతి, నర్సయ్య, రవి, శ్రీకాంత్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top