
భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి.
కమిషనర్ ఎన్.మౌర్య
భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా గంగ జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర కు జరుగుతున్న ఏర్పాట్లను ఉదయం వివిధ శాఖల అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లు, ఇందిరామైదానం, క్యూ లైన్లు, పొంగళ్ళు కొరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు. దర్శనానికి అనుమతించే ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం, విఐపి లు వెళ్ళే క్యూ లైన్లను పక్కగా చేయాలని అన్నారు. దర్శనానంతరం భక్తులు వెలుపలికి వెళ్ళే ర్యాంప్, క్యూ లైన్లను ఆర్ అండ్ బి అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసే మార్గం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తుల మధ్య తోపులాట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఆలయంలోనూ, పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి, శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. తుడా కార్యాలయంలో వి ఐ పి ల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మిగిలిన వాహనాలు లోనికి రాకుండా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అనువుగా ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. ఆలయం కు వెళ్ళే మార్గంలో ఉన్న దుకాణదారులు రోడ్లపైకి రాకుండా మార్కింగ్ చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పొంగళ్ళు పెట్టే మార్కెట్ లో తగు ఏర్పాటు చేసి, నీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు సాయంత్రం లోపు పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ, ఆర్డీవో రామ్మోహన్, ఏఎస్పీ రవి మనోహరాచారి, సూపరింటెండెంట్ ఇంజినీర్లు శ్యాంసుందర్, కృష్ణారెడ్డి, డి ఎస్పీ లు రామకృష్ణాచారి, భక్తవత్సలం, తుడా ఈ.ఈ.రవీంద్ర, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆలయ ఈ ఓ జయకుమార్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఉత్సవ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్, టిటిడి, తుడా , నగరపాలక సంస్థ, పోలీసు, ఫైర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
