
జైపూర్ ఎస్‌టీపీ లేబర్ క్యాంపులో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్….
41 వాహనాలు సీజ్, ఇతర రాష్ట్రాల కార్మికులకు అవగాహన….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
జైపూర్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల నివాస బ్యారక్‌లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో మొత్తం 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 22 మోటార్‌సైకిళ్లు, 6 మినీ బస్సులు, 9 ట్రాలీ వాహనాలు, 4 ఆటోరిక్షాలు ఉన్నాయి.
కార్యక్రమానికి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరై ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులతో సమావేశమయ్యారు. తమ స్వగ్రామ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తీసుకుని వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు. అలాగే కార్మికులు నివసించే బ్యారక్‌ల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్లాంట్ యాజమాన్యానికి సూచించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి కొనుగోలు, విక్రయం, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఇతర రాష్ట్రాల కార్మికులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని, ఆధార్, గుర్తింపు కార్డులు వంటి ధ్రువీకరణ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. ప్లాంట్ పరిసరాల్లో గొడవలు, మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొనడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. మోసపూరిత కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే సమీప పోలీసులను లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సమయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు.