
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పోలీసు అధికారులు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:రామగుండం, రాబోయే జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎన్‌టీపీసీ మిలీనియం హాల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచ్దేవా పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏసీపీ, సీఐ, ఎస్ఐ ఎన్‌టీపీసీ, ఎస్ఐ రామగుండం అధికారులు విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలని, వారి జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు