
ఫిర్యాదులు, కేసులతో పోసాని ఉక్కిరిబిక్కిరి
రిమాండ్ ఖైదీ అంటే 14రోజుల పాటు జైల్లో ఉంటారు. కానీ విచిత్రంగా నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పైగా పోసాని.. ముందు మాకే కావాలంటూ పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి.
ఓ వైపు ఫిర్యాదులు… ఇంకోవైపు కేసులు.. పోసాని కృష్ణమురళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది. అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పీఎస్‌లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. రాజంపేట జైలుకి వెళ్లి పీటీ వారెంట్లు అందించారు. పోసానిని ముందు మాకే అప్పగించాలంటూ వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు.
ఒకేసారి 3 పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు.
ప్రస్తుతం పోసాని రిమాండ్‌లో ఉన్నారు. అన్నమయ్యజిల్లా రాజంపేట జైలులో విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 13తో రిమాండ్ ముగుస్తుంది. ఇందులో ఆయనకు బెయిల్ వచ్చినా వెంటనే మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
BNS యాక్ట్ సెక్షన్ 153, 504, 67ల కింద నరసరావుపేటలో పోసానిపై గతంలో కేసు నమోదైంది.
