TEJA NEWS

అప్పలాయ గుంటలో పుష్పయాగం

తిరుపతి: తిరుపతికి 20 కి.మీ దూరంలోని అప్పలాయగుంటలో టీటీడీకి చెందిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం(రేపు) పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం రాత్రి 7.30 – 8 గం.ల మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 07 నుంచి 15వ తేదీ వరకు శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. కాగా శనివారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపన తిరుమంజనం చేపట్టనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 02 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.