Spread the love

రైతులకు సత్వర న్యాయం జరగాలి.

అమరావతి నిర్మాణం పై అసెంబ్లీ లో గళం విప్పిన సుజనా చౌదరి..

రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు.
2014 నుంచి 2019 వరకు అమరావతి నిర్మాణం పరుగులు పెట్టిందన్నారు.
ఆ తర్వాత వచ్చిన వై సీ పీ అరాచక పాలన సృష్టించి అమరావతిని విధ్వంసం చేసిందన్నారు. మూడు రాజధానులను తెర మీదకు తెచ్చి అమరావతిని విచ్చిన్నం చేయడంతో పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందన్నారు. మూడు రకాల పంటలు పండే భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులను వైసీపీ అనేక వేధింపులకు గురి చేసిందన్నారు. విభజన చట్టం ప్రకారం అమరావతి ఏర్పాటు అయిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటన చేసిన కూడా వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందన్నారు.


శాసనసభ సాక్షిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుముక్కలాటలాడారన్నారు.
అమరావతి రైతుల అర్తనాధాలను వాళ్ల దయనీయ పరిస్థితిని చూసి వారందరికీ అండగా నిలబడటంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగిందన్నారు. రాజధానిని ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనివ్వకుండా రైతుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసామన్నారు.
అమరావతిని భవిష్యత్తులో ఎవరూ కదిలించలేని విధంగా సి అర్ డి ఎ చట్టాన్ని రద్దుచేసి రేరా చట్టంగా మార్చడానికి ప్రభుత్వం జీవో తీసుకు రావాలన్నారు.
ఇప్పటివరకు రైతులకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని సుజనా ప్రశ్నించారు.

సుజనా చౌదరి ప్రశ్నకి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బదులిచ్చారు.. రాజధాని నిర్మాణం ముందుకు సాగక పోవడానికి గత ప్రభుత్వ నిర్వాకమేనని చెప్పారు.. రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, దానికి సంబంధించిన ఆర్థిక వనరుల సమీకరణ వివరాలను తెలిపారు.. ప్రపంచ బ్యాంకు, ఎడిబి తో పాటు హడ్కో, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సాయంతో దాదాపు 64 వేల కోట్ల రూపాయల అంచనాల తో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.. రోడ్లు, అధికారుల, ప్రజాప్రతినిధుల భవన సముదాయాలు, ఇతర మౌలిక సదుపాయాలను దశల వారీగా పూర్తి చేస్తామని వివరించారు.. రాజధాని విషయంలో దాష్టీకాలు, దారుణాలకు పాల్పడ్డ వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. అమరావతి రాజధాని అంశం పై సుధీర్ఘ చర్చ కూడా అవసరమని పేర్కొన్నారు..

సుజనా చౌదరి మంచి ప్రశ్న అడిగారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు.. అయితే ఈ అంశం పై సమయం చూసి ఈ సమావేశాల్లోనే చర్చ పెడతామని స్పీకర్ అన్నారు..