ఫార్మ్ పాండ్లతో వర్షపు నీటిని నిల్వ చేసి పొడి పరిస్థితులను ఎదుర్కోవాలి…

TEJA NEWS

ఫార్మ్ పాండ్లతో వర్షపు నీటిని నిల్వ చేసి పొడి పరిస్థితులను ఎదుర్కోవాలి…

— కలెక్టర్ కోయ శ్రీహర్ష….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలను మాత్రమే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులు, కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో 128 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రైతు గీత్ల పవన్ కుమార్ రెడ్డి 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ తోటను పరిశీలించి, సాగు విధానాలు, మొక్కల నాణ్యత, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలు, మొక్కల నాణ్యత, తిరుమల ఆయిల్‌కెమ్ ఫ్యాక్టరీ నిర్మాణం, భవిష్యత్తులో ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు వంటి అంశాలపై అధికారులను, కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

తిరుమల ఆయిల్‌కెమ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బురారియాతో ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అక్టోబర్ నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

రైతులకు నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలే అధిక దిగుబడులకు, దీర్ఘకాలిక ఆదాయానికి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్న కలెక్టర్, మొక్కల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉత్తమ నాణ్యత గల నాట్లను మాత్రమే సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పొడి వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. VB-G RAM (G) పథకం కింద 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న ఫార్మ్ పాండ్లను ఆయిల్‌పామ్ రైతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
వర్షపు నీటిని ఫార్మ్ పాండ్లలో నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో ఆయిల్‌పామ్ తోటలకు అందించడం ద్వారా పొడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వివరించారు. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ఫార్మ్ పాండ్లు వంటి నీటి సంరక్షణ పద్ధతులను పాటిస్తూ ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.

ఆయిల్‌పామ్ తక్కువ నీటి వినియోగంతో దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా అభివృద్ధి చెందుతోందని, జిల్లాలో అనుకూలమైన భూములు, నీటి వనరులు ఉన్న రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, తిరుమల ఆయిల్‌కెమ్ కంపెనీ ఎండీ మనీష్ బురారియా, సీఈఓ కేశు కల్యాణ్‌కర్, ఉద్యానవన అధికారి మహేష్, వ్యవసాయ అధికారి సంధ్య, కూనారం సర్పంచ్ రాజయ్య, జాఫర్‌ఖాన్‌పేట సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న, రైతులు, ఆయిల్‌పామ్ సాగుదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top