
రామగుండం పోలీస్ కమిషనరేట్
ఆధునిక సాంకేతికతతో నేరాల ఛేదనకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ….
“టెక్ టీమ్ వర్టికల్”పై సీఐలు, ఎస్సైలకు అవగాహన కార్యక్రమం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన సీఐలు, ఎస్సైలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
దర్యాప్తు నైపుణ్యాలను, సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని సమర్థవంతంగా పెంపొందించడం, ఆధునిక సాంకేతిక సాధనాలపై అవగాహన కల్పించడం మరియు విధుల నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా “టెక్ టీమ్ వర్టికల్” అంశంపై ఈ శిక్షణ కార్యక్రమాన్ని వర్టికల్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సుల్తానాబాద్ ఇన్‌స్పెక్టర్ రంజిత్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, కోర్టుల్లో నిందితులకు తగిన శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సిద్ధం చేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ శిక్షణలో భాగంగా ఆధునిక సైబర్ దర్యాప్తు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ సైన్స్ వినియోగం, కొత్త చట్టాలు మరియు నిబంధనలపై అవగాహన, నాణ్యమైన చార్జిషీట్‌ల తయారీ వంటి అంశాలపై అధికారులకు సమగ్ర శిక్షణ అందించారు.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ ఫుటేజీలను శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించి భద్రపరచడం, నేరస్థలాల్లో లభించే వేలిముద్రలు, డీఎన్‌ఏ తదితర ఆధారాలను సంరక్షించడం, ఆన్‌లైన్ మోసాలు మరియు సోషల్ మీడియా నేరాలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించే విధానాలపై అధికారులు అవగాహన పొందారు.
అదేవిధంగా సైబర్ భద్రత, డిజిటల్ పరికరాల వినియోగం, డేటా నిర్వహణ, సాంకేతిక ఆధారాల సేకరణ, ఆన్‌లైన్ నేరాల దర్యాప్తు, సాంకేతిక బృందాల సమన్వయం మరియు ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో సమర్థవంతంగా వినియోగించే విధానాలపై ఐటీ కోర్ సిబ్బంది ప్రత్యేకంగా వివరించారు.
అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను, సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు.