
ఆర్టీసీ బస్టాండ్ స్వీపర్ కాంట్రాక్ట్ కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు, పని భద్రత కల్పించాలి….
ఆర్టీసీ డీఎం కే. కవితకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు…..
సమస్యలు పరిష్కరించకపోతే డీఎం కార్యాలయ ముట్టడికి హెచ్చరిక
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
ఆర్టీసీ గోదావరిఖని బస్టాండ్‌లో పనిచేస్తున్న స్వీపర్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం వేతనాలు చెల్లించడంతో పాటు పని భద్రత, సంక్షేమ సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ రామగుండం నగర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ డీఎం కార్యాలయంలో డీఎం కే. కవితకు పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వీపర్ కాంట్రాక్ట్ కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మికులకు యూనిఫామ్‌లు, షూస్, టవల్స్, రేన్‌కోట్లు, ఎండ నుంచి రక్షణ కోసం టోపీలు, బెల్లం, కొబ్బరి నూనె, సబ్బులు వంటి అవసరమైన వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు.
వేతన చట్టం–1936 ప్రకారం ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్ ఆర్టీసీ అధికారుల అండదండలతో ప్రతి నెల 20వ తేదీ తర్వాత కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తూ కార్మికులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సంబంధిత కాంట్రాక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంను కోరారు.
అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు పీఎఫ్, వేతన స్లిప్పులు, వార్షిక బోనస్‌తో పాటు శాశ్వత ఉద్యోగులకు కల్పిస్తున్న సంక్షేమ సదుపాయాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆర్టీసీ డీఎం కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శనిగరపు తిరుమల, దుబాసి స్వరూప, పొడిశెట్టి సుగుణ, బొందిల సంగీత, మాడుగుల శారద, గాలిపెల్లి చిన్న పోసు తదితర కార్మికులు పాల్గొన్నారు.