
వచ్చే వేసవి దృష్ట్యా రక్షణ ఏర్పాట్లను పూర్తి చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
రానున్న వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు ప్రజలను వడగాలుల నుండి అప్రమత్తం చేయడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్ల ను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రానున్న వేసవి కాలానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖలు వేసవి లో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రాలలో ఐదు వందల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, షెడ్ నెట్లను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమల వద్ద చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని, కూలీలకు ఓఆర్ఏస్ ప్యాకెట్లను అందజేయాలన్నారు. నగర పరిధిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆరోగ్య సంరక్షణ సూత్రాలను తెలిపే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యా శాఖ అధికారులకు తెలియజేశారు. వేసవి కాలం దృష్ట్యా ప్రతి పాఠశాల, గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ వేసవిలో వడ గాలుల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజలకు వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలను వైద్య ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మండల స్థాయిలో సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయనున్నట్లు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తలపాగ తప్పక ధరించాలన్నారు. తెల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలని, తగినంత నీరు, ద్రవ పదార్థాలను తీసుకోవాలని, ఎలాంటి మత్తు పదార్థాలను సేవించ కూడదని అన్నారు. వడదెబ్బకు గురైన వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు.
సమావేశం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వడ గాలుల నుండి సంరక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిఅర్డీవో శ్రీనివాస రావు, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయ్ కుమార్, వైద్య విధాన పరిషత్ ఆర్ఎంవో డాక్టర్ బాలకృష్ణ, ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అహ్మద్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, మిషన్ భగీరథ ఈఈ రామాంజనేయులు, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
