
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలి
జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్,
సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి నెలలో నమోదైన 9 గంజాయి కేసులతో పాటు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, డిసిపి షేక్ సలీమా మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే వారిపై, వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సినిమా హాళ్ల లో కూడా మత్తు పదార్థాల నియంత్రణకు స్లైడ్స్ వేసే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఎప్పటి కప్పుడు అవగాహన కార్యక్రమాల నిర్వహించాలన్నారు. క్రీడా, ఇతర రంగాల లోని సెలబ్రిటీలతో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై విస్తృత ప్రచారాన్ని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, హనుమకొండ, కాజీపేట ఏసీపీలు దేవేందర్ రెడ్డి, తిరుమల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
