
సింగరేణి పారిశుధ్య కార్మికులకు షీ టీమ్స్ అవగాహన
సదస్సు….
మహిళల భద్రతపై చైతన్యం కల్పించిన ఎస్‌ఐ ఉషారాణి….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, మంచిర్యాల, : మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా మంచిర్యాల జిల్లా షీ టీమ్స్ ఆధ్వర్యంలో సింగరేణి పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ పర్యవేక్షణలో సీసీసీ నస్పూర్ టౌన్‌షిప్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, తెల్లవారుజాము నుంచే విధుల నిర్వహణ కోసం రోడ్లపైకి వచ్చే మహిళా పారిశుధ్య కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడకుండా ధైర్యంగా ఉండాలని, వారికి అండగా మరియు రక్షణగా షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.
మహిళలకు చట్టపరంగా కల్పించబడిన హక్కులు, వేధింపుల నుంచి రక్షణ పొందే మార్గాలు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, షీ టీమ్స్ విధులు మరియు మహిళల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై సిబ్బంది అవగాహన కల్పించారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరిస్తూ డయల్-100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లను వివరించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఆమె, ఎటువంటి వేధింపులకు గురైనా మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, కాంట్రాక్టర్ గోపాలరావు, సూపర్‌వైజర్ రఘు తదితరులతో పాటు సింగరేణి పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.