TEJA NEWS

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వేధిస్తున్న వైద్యుల కొరత వసతుల లేమితో ఎదురవుతున్న ఇబ్బందులు
— బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అప్ గ్రేడులతోనే సరి పెడితే ఎలా? అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, వైద్యుల కొరత, వైద్య సిబ్బంది కొరతను ఆర్ఎంవో డాక్టర్ జావేద్ ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మొదటగా ఏరియా ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కాలక్రమేనా అప్ గ్రేడ్ చేస్తూ నేడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా మార్చడం, అందులోనూ మెడికల్ కళాశాల మంజూరై టీచింగ్ ఆసుపత్రిగా కూడా కొనసాగుతుందని అన్నారు.

కేవలం అప్ గ్రేడ్ తోనే సరిపెడుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించకపోవడం వల్ల రోగులకు, రోగుల సహాయకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

ఉన్న కొద్దిమంది వైద్యులే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.

ప్రసవాలలో రాష్ట్రంలోనే సంగారెడ్డి, మహబూబ్ నగర్ తర్వాత వనపర్తి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉందని, నెలలో దాదాపు 500 ప్రసవాలు చేస్తూ రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.

పారిశుద్ధ్య విషయంలో సంతృప్తి ఉన్నప్పటికీ ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రికి అనుగుణంగా వైద్య పోస్టులు లేకపోవడం ఇక్కడి ప్రజలకు ఒక శాపంలా మారిందని, 39 ప్రొఫెసర్ పోస్టులకు గాను 14 మంది మాత్రమే ఉన్నారని, అసోసియేట్ పోస్టులు 26 ఖాళీగా ఉన్నాయని, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా దాదాపు 65, ట్యూటర్ పోస్టులు 8, ఎస్ ఆర్ పోస్టులు కూడా చాలావరకు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

స్వయాన ముఖ్యమంత్రి చదువుకున్న జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడం సరికాదని, వెంటనే అన్ని రకాల వైద్య పోస్టులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయాలన్నారు.

నియోజకవర్గ ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆసుపత్రి నిర్మాణ పనులు వీలైనంత త్వరగా మొదలు పెట్టాలన్నారు.

పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే తమ లక్ష్యమని, బీసీ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో గతంలో కూడా ఉచిత విద్యా, వైద్యం కోసం పాదయాత్ర చేశామని ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ఆర్టీఐ విభాగం ఉపాధ్యక్షులు రాఘవేందర్, రామన్ గౌడ్, గిరిధర్ గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.