
సింగరేణి అధికారుల సమస్యలపై త్వరలో సానుకూల నిర్ణయం….
యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:హైదరాబాద్, సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా అధికారుల వేతన సవరణ, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ అమలుకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యంగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తాడిచర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరులో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపేందుకు సింగరేణి అధికార సంఘం నాయకులు ఆయనను కలిసి అధికారుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అధికారుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఉదయం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రుతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇంధన భద్రతను అందించడంలో సింగరేణి కార్మికులు, అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అధికారుల్లో అసంతృప్తి నెలకొనకుండా వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికార సంఘం నాయకులతో చర్చించి వారికి భరోసా కల్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా రానున్న రెండు నుంచి మూడు నెలల్లో అధికారుల విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే ప్రపంచీకరణ, పెరుగుతున్న పోటీ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో సింగరేణి పోటీతత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో సింగరేణిని బహుముఖ రంగాల్లో విస్తరించి అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని, ఈ దిశగా అధికార సంఘం నాయకులు కూడా సానుకూల దృక్పథంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు సింగరేణి అధికార సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి, విస్తరణ, సుస్థిర భవిష్యత్తు కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అధికారుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.