
తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి.. ప్రతి గ్రామం, వార్డులో పరిష్కారం చూపాలి…
నాణ్యమైన తాగునీటి సరఫరాకు నిరంతర పర్యవేక్షణ.. అధికారులను ఆదేశించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో తాగునీటి సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, సమస్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, వార్డుల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
క్షేత్రస్థాయి సమస్యలపై సమగ్ర నివేదిక
క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామం, వార్డులో తాగునీటి సమస్యలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి సరఫరా పరిస్థితి, సమస్యలు, అవసరమైన చర్యలను గ్రామాలు, వార్డుల వారీగా నమోదు చేసి సమగ్ర నివేదిక సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు.
తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, నీటి నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాలు, వార్డుల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, తాగునీటి సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ పూర్ణచందర్, ఏఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
