ఫోరెన్సిక్ సేవలకు ఆధునిక సదుపాయాలు.. ప్రజలకు మరింత మెరుగైన మెడికో-లీగల్ సేవలు….

ఫోరెన్సిక్ సేవలకు ఆధునిక సదుపాయాలు.. ప్రజలకు మరింత మెరుగైన మెడికో-లీగల్ సేవలు….

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం / : రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగం ద్వారా ప్రజలకు, పోలీసు శాఖకు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో-లీగల్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

ఫోరెన్సిక్ విభాగంలో ప్రతి నెల సుమారు 30 మెడికో-లీగల్ పోస్టుమార్టంలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో క్లిష్టమైన, సవాళ్లతో కూడిన కేసులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో, నిష్పక్షపాతంగా, సకాలంలో పోస్టుమార్టంలు నిర్వహించడం ద్వారా పోలీసు దర్యాప్తు, న్యాయ ప్రక్రియకు ఫోరెన్సిక్ వైద్యులు కీలక సహకారం అందిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో రాత్రి వేళల్లో కూడా పోస్టుమార్టంలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లోనూ మెడికో-లీగల్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మోర్చరీలో సౌకర్యాల మెరుగుదలలో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టి, మెరుగైన లైటింగ్, ఇతర అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా, శాస్త్రీయంగా నిర్వహించేందుకు కొత్త డిసెక్షన్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మృతదేహాలను సురక్షితంగా, గౌరవప్రదంగా భద్రపరిచేందుకు 4 కోల్డ్ ఫ్రీజర్ బాక్సులను మంజూరు చేసి మోర్చరీకి అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సదుపాయాలు మృతదేహాల భద్రత, సంరక్షణతో పాటు పోస్టుమార్టం ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని అన్నారు.

మెరుగైన మోర్చరీ సదుపాయాలతో ప్రజలకు, పోలీసు శాఖకు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో-లీగల్ సేవలు అందించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగం న్యాయ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున శాస్త్రీయ విధానం, నిష్పక్షపాత వైఖరి, సకాలంలో సేవలందించడాన్ని ప్రాధాన్యతగా తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top